Kedarnath: నిజంగా అద్భుతమే... కేదార్ నాథ్ వరదల్లో తప్పిపోయి... ఐదేళ్ల తరువాత కుటుంబం చెంతకు చేరిన యువతి!

  • 2013లో తల్లిదండ్రులతో కలసి కేదార్ నాథ్ కు 
  • వరదల్లో తప్పిపోయిన చంచల
  • ఎన్జీవో సంస్థ కృషితో తిరిగి ఇంటికి

ఓ బాలిక జీవితంలో జరిగిన ఈ ఘటన నిజంగా అద్భుతమే. 2013లో కేదార్ నాథ్ వరదల్లో తప్పిపోయిన 12 ఏళ్ల చంచల, ఐదేళ్ల తరువాత 17 ఏళ్ల వయసులో ఇప్పుడు తిరిగి తన కుటుంబాన్ని చేరుకుంది. అలీగఢ్ లో వెలుగుచూసిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, చంచల్ అనే మతిస్థిమితం లేని బాలిక, తన తల్లిదండ్రులతో కలసి కేదార్ నాథ్ యాత్రకు వెళ్లింది. అదే సమయంలో వరదలు ముంచెత్తగా, ఎటువారు అటు చెల్లాచెదురయ్యారు. ఈ ప్రమాదంలో చంచల్ తండ్రి మరణించగా, సహాయక చర్యల తరువాత తల్లి ఇంటికి చేరుకుంది.

తప్పిపోయిన చంచల్ ను కొందరు చేరదీసి, జమ్మూ కాశ్మీర్ లోని ఓ అనాధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమె వచ్చీరాని మాటలతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండటంతో, ఆమె వివరాలు కనుక్కునేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె అలీగడ్ గురించి, అక్కడున్న తనవారి గురించి కాస్తంత సమాచారం ఇవ్వడంతో, విషయాన్ని చైల్డ్ లైన్ సంస్థకు చేరవేశారు.

ఓ ఎన్జీవో సంస్థకు చెందిన జ్ఞానేంద్ర మిశ్రా ఎంతో శ్రమించి, పోలీసుల సాయంతో చంచల కుటుంబాన్ని కనిపెట్టారు. తమ మనవరాలు తిరిగి ఇల్లు చేరుకోవడం ఓ అద్భుతమని చంచల తాతయ్య హరీష్ చంద్, నానమ్మ శకుంతలాదేవి వ్యాఖ్యానించారు.

More Telugu News