kolkata: మూఢనమ్మకపు కొడుకు.. తల్లి మృతదేహంతో పద్దెనిమిది రోజులు గడిపిన తనయుడు!

  • కోల్ కతాలోని సాల్ట్ లేక్ లో ఘటన
  • 21 రోజుల తర్వాత ఖననం చేయాలనుకున్న కొడుకు
  • అసలు విషయం బయటపడటంతో రంగంలోకి పోలీస్

ఎవరైనా మృతి చెందిన ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మృతదేహాన్ని ఖననం చేస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్న మూఢనమ్మకంలో ఉన్న ఓ యువకుడు తన తల్లి విషయంలో ఇదే విధంగా చేయాలనుకుని చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. కోల్ కతా లోని సాల్ట్ లేక్ కు చెందిన 38 సంవత్సరాల మైత్రేయ భట్టాచార్య ఈ ఘటనకు పాల్పడ్డాడు. వృత్తి రీత్యా న్యూరో సర్జన్ అయిన అతని తండ్రి జీసీ భట్టాచార్య ఆరేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి తల్లి కృష్ణ (77)తో కలిసి ఉంటున్నాడు మైత్రేయ.

పద్దెనిమిది రోజుల క్రితం తల్లి కృష్ణ మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని ఖననం చేసే విషయంలో మైత్రేయ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించాలనుకున్నాడు. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచాలని చూశాడు. అలా, 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలంటూ అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది.

ఈ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై మైత్రేయను పోలీసులు విచారణ చేశారు. ఇరవై ఒక్కరోజుల తర్వాత మృతదేహాన్ని ఖననం చేస్తే మంచిదని, అందుకే, ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను ఎంసీఏ చదువుకున్నానని మైత్రేయ చెబుతుండగా, తన చదువును మధ్యలోనే వదిలేశాడని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అతని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని పోలీసుల సమాచారం. 

More Telugu News