Mumbai Police: రెండో గాళ్ ఫ్రెండ్ అబార్షన్ కోసం మొదటి గాళ్ ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకున్న ప్రబుద్ధుడు!

  • భార్యతో మనస్పర్థలతో విడాకులకు దరఖాస్తు
  • ఎయిర్‌లైన్ ఉద్యోగిగా నమ్మించి మరో మహిళతో పరిచయం
  • పలు దఫాలుగా డబ్బులు తీసుకుని.. ఇంకో మహిళతో చెట్టపట్టాలు

భార్యతో విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఓ గాళ్‌ఫ్రెండ్ అబార్షన్ కోసం మరో గాళ్‌ఫ్రెండ్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదటి గాళ్‌ఫ్రెండ్ నుంచి ఏకంగా రూ. 6.5 లక్షలు తీసుకున్న అతడు మరో గాళ్‌ఫ్రెండ్ గర్భ విచ్ఛిత్తి కోసం రూ. 60 వేలు ఖర్చు చేశాడు. అత్యాచారం, మోసం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.  

ముంబైలో జరిగిన ఈ ఘటనలో సదరు మోసగాడిని 23 ఏళ్ల అశ్విన్ పాండేగా పోలీసులు గుర్తించారు. కండివలీ వెస్ట్‌లోని చర్కోప్‌లో నివసిస్తున్న పాండే భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులకు దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలో 30 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఇటీవలే ఆమె ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఆమెను ఇంప్రెస్ చేసే ఉద్దేశంతో తాను ఓ ఎయిర్‌లైన్ కంపెనీలో సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌గా చేరినట్టు చెప్పి ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆమెను పూర్తిగా బుట్టలో వేసుకున్నాక డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. తనకు బాగా దగ్గరి బంధువు ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, చికిత్స కోసం తన డబ్బులు సరిపోవడం లేదని నమ్మించాడు. పలు దఫాలుగా ఆమె నుంచి రూ.6.5 లక్షలు తీసుకున్నాడు.

ఈ క్రమంలో ఓ రోజు పాండే పోన్‌లో ఓ మెసేజ్ చూసిన ఆమెకు అనుమానం వచ్చింది. ‘ఐ లవ్ యూ’ అని రాసి ఉన్న మెసేజ్‌ను చదివిన ఆమె పాండేను అనుమానించింది. ఈ విషయమై అతడితో గొడవ పడితే.. తనను ఆటపట్టించేందుకు తన స్నేహితుడే అలా పంపాడని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ నమ్మని ఆమె.. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చిన నంబరుకు ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడింది.

తాను అబార్షన్ కోసం పాండే అనే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీ వచ్చినట్టు అవతలి మహిళ చెప్పింది. దీంతో నిర్ఘాంతపోయిన ఆమె తాను మోసపోయినట్టు గుర్తించింది. ఆసుపత్రి ఖర్చుల కోసం అర్జెంటుగా రూ. 60 వేలు కావాలని తీసుకెళ్లిన పాండే వాటిని మరో గాళ్‌ఫ్రెండ్ అబార్షన్ కోసం ఉపయోగిస్తున్నట్టు తెలిసి తట్టుకోలేకపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

More Telugu News