Andhra Pradesh: జగన్ కారణంగానే క్విడ్ ప్రోకో వంటి పదాలు ప్రజలకు తెలిశాయి!: మంత్రి నక్కా ఎద్దేవా

  • దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలి
  • జైలు జీవితం, నల్ల కాగితాలు వారి సంస్కృతే
  • గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తే, పోటీగా బ్లాక్ పేపర్లు విడుదల చేస్తామని ప్రతిపక్ష వైసీపీ చెప్పడంపై మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా స్పందించారు. శ్వేతపత్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. జైలు జీవితాలు, నల్ల కాగితాల సంస్కృతి వైసీపీదేనని దుయ్యబట్టారు.  గుంటూరు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ అధినేత జగన్ కారణంగానే క్విడ్ ప్రోకో లాంటి పదాలు ప్రజలకు తెలిశాయని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి చేసిన మోసాన్ని శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై జగన్ స్పష్టత ఇవ్వాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు.

More Telugu News