indonesia: జావా, సుమత్రా దీవుల్లో ‘అల’జడికి అదే కారణం...అగ్నిపర్వతం గోడ కుప్పకూలి విరుచుకుపడిన అలలు

  • గంటకు 960 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు
  • పేలుడును ఊహించని ద్వీపవాసులు
  • తేరుకునేలోగానే జరిగిపోయిన నష్టం

ఇండోనేషియాలోని సుమత్రా, జావా ద్వీపాలపై సునామీ విరుచుకుపడి భారీగా ప్రాణనష్టం జరగడం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. ప్రకృతి విపత్తును నూటికి నూరు శాతం అంచనా వేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా రాకాసి అలలను అంచనా వేయడంలో ఆ దేశం ఎందుకు విఫలమయ్యిందన్న చర్చ మొదయింది.

రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో జలవిలయంను గుర్తించడంలో ఎక్కడో పొరపాటు జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. సుమత్రా, జావా ద్వీపాలకు తుపాన్‌లు, సునామీలు కొత్తేమీ కాదు. తరచూ ప్రకృతి విపత్తులు ఎదుర్కోవడం ఇక్కడి ప్రజలకు అలవాటే. అయితే శనివారం రాత్రి చడీచప్పుడు కాకుండా అలలు విరుచుకుపడడం, దాదాపు 250 మంది మృత్యువాత పడడం, వేలాది మంది గాయపడడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఈ విపత్తును అంచనా వేయడంలో విఫలం కావడానికి సముద్రగర్భంలోని అగ్నిపర్వతం విస్పోటనమే కారణమని భావిస్తున్నారు.

అగ్నిపర్వతం బద్దలై పర్వతంలోని ఒక భాగం కుప్పకూలి ఆ శకలాలు సముద్రంలో పడితే అకస్మాత్తుగా నీరు స్థానభ్రంశం చెంది సునామీకి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. లేదా అగ్నిపర్వతంలోని శిలాద్రవ వాయువు, భూగర్భ జలానికి సంబంధించిన ఆవిరిని వెదజల్లే ప్రియాటోమ్యాగ్మాటిక్‌ విస్పోటనం సంభవించి శిలాద్రవం నిల్వఉండే గది కుప్పకూలినా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఈ రెండింటిలో ఏది జరిగినా తీరం వైపు అలలు అత్యంత వేగంగా దూసుకువచ్చి ముంచెత్తుతాయి.   సుమత్రా, జావా ద్వీపాలపై అలలు విరుచుకుపడడానికి అగ్నిపర్వతం బద్దలై అనక్‌క్రాకటోవాలోని ఓ భాగం సముద్రంలోకి కుప్పకూలడం కారణం కావచ్చని నిపుణుల అంచనా.

ఈ అగ్నిపర్వతం నుంచి ఇటీవల కాలంలో శబ్దాలు, విస్పోటాలు ఎక్కువయ్యాయి. అయితే ఎప్పటి నుంచో ఇవి సర్వసాధారణంగా మారడంతో స్థానికులు పట్టించుకోవడం మానేశారు. శనివారం కూడా పెద్ద విస్పోటం ఏమీ లేకుండా అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు. అగ్నిపర్వత భాగం సముద్రంలో కుప్పకూలడంతో నీరు స్థానభ్రంశం చెంది గంటకు 640 నుంచి 960 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకువచ్చింది. సముద్రంలో ఉన్నప్పుడు ఈ తరంగం ఎత్తు పెద్దగా ఉండదు.

కానీ దాదాపు 200 కిలోమీటర్ల దూరం మేర విస్తరించి ఉన్న అల తీరం సమీపంలోకి రాగానే వేగం తగ్గించుకుని ఎత్తు పెంచుకుంటుంది. పెను శక్తితో తీరాన్ని ముంచెత్తుతుంది. శనివారం రాత్రి ఇండోనేషియా ద్వీపాల్లో ఇదే జరిగిందని, అందుకే జనం అప్రమత్తం అయ్యేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News