KCR: నేటి మధ్యాహ్నం భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు కేసీఆర్!

  • కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్
  • నేటి సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో భేటీ
  • ఆపై ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు మకాం
  • ప్రధానిని మర్యాదపూర్వకంగా కలవనున్న కేసీఆర్

బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టి, ఓ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్, నేడు భువనేశ్వర్ నుంచి కోల్ కతాకు చేరుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న భువనేశ్వర్ కు వచ్చిన కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో కూటమిపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆపై రాత్రికి అక్కడే బస చేసిన ఆయన, నేడు ఉదయం పూరీ జగన్నాధునితో పాటు, కోణార్క్ లోని సుప్రసిద్ధ సూర్య దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఆపై మధ్యాహ్నం నుంచి కేసీఆర్ కోల్ కతాకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశమై, కూటమిని ముందుకు తీసుకెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆపై ఆయన కలకత్తా కాళికామాత ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లే కేసీఆర్, రెండు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి, పలు ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్న కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషనర్ తోనూ సమావేశం కానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లను కేసీఆర్ కలుస్తారు.

More Telugu News