Cricket: రూ.161 కోట్లను వెంటనే చెల్లించండి..లేదంటే ప్రపంచకప్ ను లాగేసుకుంటాం!: భారత్ కు ఐసీసీ వార్నింగ్

  • పన్ను చెల్లింపుపై ఐసీసీ-బీసీసీఐ గొడవ
  • ఆదాయంలో కట్ చేస్తామని బెదిరింపులు
  • శశాంక్ మనోహర్ పై మండిపడుతున్న అధికారులు

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ)కి కొత్త తలనొప్పి వచ్చింది. 2016లో ప్రపంచకప్ సందర్భంగా పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కట్టిన రూ.161.32 కోట్లను వెనక్కు ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బీసీసీఐని డిమాండ్ చేసింది. లేదంటే 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ తో పాటు 2021 ఛాంపియన్స్ ట్రొఫీని మరో దేశానికి తరలిస్తామని హెచ్చరించింది.

2016లో టీ20 ప్రపంచకప్ భారత్ లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే దాన్ని తాము భరిస్తామని హామీ ఇచ్చింది. కానీ టోర్నీ పూర్తయ్యాక వేర్వేరు పన్నుల కింద సుమారు రూ.161.32 కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. దీంతో ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాక, మిగిలిన మొత్తాన్ని ఐసీసీకి అందించింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ కోరుతోంది.

లేదంటే భారత్ కు రావాల్సిన ఆదాయం నుంచి ఈ మొత్తాన్ని కోత పెడతామని హెచ్చరించింది. అంతేకాకుండా 2023 వన్డే ప్రపంచకప్, 2021 ఛాంపియన్స్ ట్రోఫిలను ఇతర దేశానికి తరలిస్తామని అల్టిమేటం జారీచేసింది. కాగా, అదనపు పన్ను భారాన్ని భరిస్తామని తాము హమీ ఇచ్చినట్లు ఉన్న మినిట్స్ ను చూపాలని బీసీసీఐ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మనవాడే అని శశాంక్ మనోహర్ ను ఐసీసీ అధ్యక్షుడిని చేస్తే.. సొంత బోర్డుకే ఎసరు పెడుతున్నాడని మండిపడ్డారు. ఐసీసీ కోరిన రూ.161.32 కోట్లను ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు.

More Telugu News