Gujarath: బర్త్ సర్టిఫికెట్ ఇమ్మంటే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు!

  • గుజరాత్ లో గవర్నమెంట్ ఉద్యోగుల నిర్వాకం
  • మీడియాలో వైరల్ గా మారిన వ్యవహారం
  • వార్తలపై స్పందించిన ప్రభుత్వ అధికారి

ప్రభుత్వ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కుమార్తెను స్కూలులో చేర్పించేందుకు ఓ తండ్రి జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) కోసం దరఖాస్తు చేయగా, మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీచేశారు. దీంతో దాన్ని చూసిన సదరు తండ్రి షాక్ కు గురయ్యాడు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరలో చోటుచేసుకుంది.

వడోదరకు చెందిన మిథిల్‌భాయీ పటేల్ తన కుమార్తెను స్కూలులో చేర్పించడం కోసం బర్త్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేశాడు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది, చిన్నారికి డెత్ సర్టిఫికెట్ ను జారీచేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కంగుతిన్న పటేల్.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

అయినా వారు సైతం పట్టించుకోకపోవడంతో మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఈ వ్యవహారం వైరల్ గా మారడంతో సర్టిఫికెట్ జారీచేసిన అధికారి నరేశ్ స్పందించారు. పొరపాటున చిన్నారికి డెత్ సర్టిఫికెట్ జారీచేశామని వివరణ ఇచ్చారు. త్వరలోనే దాన్ని సరిదిద్ది బర్త్ సర్టిఫికెట్ ను ఇస్తామని హామీ ఇచ్చారు.  

More Telugu News