Andhra Pradesh: టీడీపీ ఆఫీసుకు ఆ భూమిని ఇవ్వొద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు!

  • శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఘటన
  • డీఈఈ కార్యాలయంలో టీడీపీ ఆఫీస్ ఏర్పాటు
  • అనుమతి ఇవ్వడంపై ప్రొఫెసర్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నిన్న శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే జిల్లాలో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగింది. జిల్లాలోని ఆముదాలవలసలో పంచాయతీరాజ్‌ డీఈఈ కార్యాలయం ప్రాంగణంలో టీడీపీ ఆఫీసు ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయింది. ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న చింతాడ రవి కుమార్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

టీడీపీ ఆఫీసు కోసం 30 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు కేటాయించారని పిటిషనర్ తెలిపారు. ఈ భూమి మార్కెట్ విలువ రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించారు. ప్రజాప్రయోజనాలు పక్కన పెట్టి ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి కేటాయించారని ఆరోపించారు. పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉందని గుర్తుచేశారు. ఇలాంటి ముఖ్యమైన సంస్థలకు స్థలం కేటాయించకుండా రాజకీయ పార్టీలకు పట్టణంలో స్థలం ఇవ్వడం సబబు కాదని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, భూ పరిపాలన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీసీఎల్‌ఏ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, ఆముదాలవలస ఎమ్మార్వో, జిల్లా పరిషత్‌ సీఈవో, ఆముదాలవలస ఎంపీడీవో, పంచాయతీరాజ్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజినీరు. ప్రభుత్వ విప్‌, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. వెంటనే టీడీపీ కార్యాలయం కోసం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరారు.

More Telugu News