Khammam District: మా ఓట్లతో గెలిచారు...మమ్మల్ని నిలువునా ముంచారు: కాంగ్రెస్‌పై సీపీఐ ఫైర్‌

  • తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆ మాత్రం స్థానాలు మా పుణ్యమే
  • వారు మాత్రం పొత్తు ధర్మాన్ని పాటించలేదు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాలు గెల్చుకుందంటే అది కేవలం సీపీఐ ఓట్ల పుణ్యమని, కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ అభ్యర్థులను నిలువునా ముంచేసిందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుల తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. గెలిచిన స్థానాల్లోనే పోటీ చేస్తున్నామని చెప్పి కొన్ని స్థానాలు లాక్కున్నారని, తీరా అక్కడ ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన మల్లు భట్టివిక్రమార్క సీపీఐ పోటీ చేసిన తన పక్క నియోజకవర్గం వైరాలో ప్రచారం కూడా నిర్వహించలేదన్నారు. పైగా జిల్లా కాంగ్రెస్‌ పెద్దలంతా వైరాలో స్వతంత్ర అభ్యర్థికే మద్దతు పలికారని ధ్వజమెత్తారు. ఇంతా చేసి గెలిపించినా వారిని కాపాడుకోగలిగారా అంటే అదీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కొన్ని స్థానాలైనా గెలిచిందంటే అది సీపీఐ ఓట్లతోనే సాధ్యమయ్యిందని చెప్పారు.

అధికార పార్టీ తన అన్ని శక్తులనూ ఉపయోగిస్తే, అధికారులు కూడా  తమవంతు సాయం చేశారని ఆరోపించారు. ప్రజలు నమ్మి తమకు ఓటేస్తే గెలిచిన అభ్యర్థులు అధికారం యావతో పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరుతున్నారన్నారు. ఇటువంటి  వారికి ప్రజలు సమయం వచ్చినప్పుడు బుద్ధిచెబుతారని, ఇది ఏ పార్టీ వారికైనా వర్తిస్తుందని స్పష్టం చేశారు.

More Telugu News