sabarimala: శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్.. పంబ వద్ద 11 మంది మహిళలను అడ్డుకున్న భక్తులు!

  • ఆలయంలోకి వెళ్లితీరుతామన్న మహిళలు
  • ఇంకా ఆలయానికి రానున్న 39 మంది
  • భారీగా పోలీసుల మోహరింపు

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో 10-50 ఏళ్ల మధ్య ఉన్న మహిళల ప్రవేశాన్ని భక్తులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వయసు ఉన్న మహిళలను స్వామి దర్శనానికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చాలామంది సంప్రదాయవాదులు దీన్ని అంగీకరించలేదు. తాజాగా వార్షిక మండల పూజ త్వరలోనే మొదలుకానున్న నేపథ్యంలో చెన్నై కేంద్రంగా ఉన్న ఎన్జీవో మనిథి సంస్థ ఆందోళనకారులకు సవాలు విసిరింది. 10 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న 50 మంది మహిళలతో స్వామివారిని దర్శించుకుంటామని ప్రకటించింది.

అంతేకాదు.. వీరిలో 11 మంది ఇప్పటికే పంబ వద్దకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడే ఆందోళన చేస్తున్న పలువురు భక్తులు వీరిని అడ్డుకున్నారు. ఆలయంలోకి వీరిని వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. మరోవైపు పరిస్థితి చేయిదాటకుండా కేరళ ప్రభుత్వం ఆలయ పరిసరాలతో పాటు వెళ్లే మార్గంలోనూ భారీగా పోలీసులను మోహరించింది. శబరిమల అయ్యప్పస్వామిని 10-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దర్శించుకోవచ్చని ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.

More Telugu News