Andhra Pradesh: వివాదాల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. రాంగోపాల్ వర్మపై కేసులు పెట్టేందుకు టీడీపీ నేతల సన్నాహాలు!

  • చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీశారని ఆగ్రహం
  • దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఎస్వీ మోహన్ రెడ్డి
  • చంద్రబాబును డైరెక్ట్ గా ఎదుర్కోవాలని సవాల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీపార్వతి, ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాన పాత్రలుగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘వెన్నుపోటు’ పాటను ఆయన నిన్న విడుదల చేశారు. కాగా, ఈ పాట ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువు అయింది. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన పాట ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించేలా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు వర్మతో పాటు నటీనటులు, ఈ సినిమాకు పనిచేసిన ఇతర నిపుణులపై ఏపీ అంతటా కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ విషయమై టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు పాటలో చంద్రబాబును అనుచితంగా చూపారని మండిపడ్డారు. చంద్రబాబు ఫొటోలను వాడుకుని ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్మతో పాటు ఇతర చిత్ర యూనిట్ పై పరువు నష్టంతో పాటు క్రిమినల్ అభియోగాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

వర్మ ఒక్కడే ఈ పని చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదనీ, వెనుక ఉండి శిఖండి రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దమ్ముంటే సదరు నేతలు ముందుకొచ్చి చంద్రబాబును ఎదుర్కోవాలని సవాలు విసిరారు. ఈ వ్యవహారంపై ఏపీ అంతటా టీడీపీ శ్రేణులు కేసులు నమోదు చేస్తాయని హెచ్చరించారు.

More Telugu News