Visakhapatnam District: కాంగ్రెస్‌లో చేరిన మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు

  • మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక
  • గత కొంతకాలంగా మంత్రికి దూరంగా ఉంటున్న పరుచూరి
  • రానున్న ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే, మానవ వలరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒకప్పటి ప్రధాన అనుచరుడు పరుచూరి భాస్కరరావు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోను మంత్రి గంటాను అమాత్య పదవి వరించిన విషయం తెలిసిందే. ఈ రెండు సందర్భాల్లోనూ మంత్రికి సమీప బంధువు కూడా అయిన పరుచూరి భాస్కరరావు అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాల్లో అన్నీతానై వ్యవహరించే వారు. ఒకవిధంగా చెప్పాలంటే షాడో మంత్రిగా పరుచూరి చలామణి అవుతున్నారన్న ఆరోపణలు ఉండేవి.

అటువంటి పరుచూరి కొన్నాళ్లుగా మంత్రి గంటాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జిల్లాలో వెలుగు చూసిన భూభాగోతాలు, మంత్రి గంటాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలు షికారు చేశాయి. మొత్తం మీద కారణం ఏదైనా, కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన పరుచూరి భాస్కరరావు హఠాత్తుగా కాంగ్రెస్‌ వేదికపై ప్రత్యక్షమయ్యారు. జిల్లాలో పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో అనకాపల్లి సభలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రి గంటా అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. అప్పట్లో ఆ నియోజకవర్గంలోనూ పరుచూరిదే హవా. ఆ పరిచయాలతోనే రానున్న ఎన్నికల్లో ఆయన ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేస్తారన్న ఊహాగానాలు కొన్నాళ్ల నుంచి ఉన్నాయి. తాజాగా ఆయన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం ఖాయమైందని చెప్పొచ్చు.

More Telugu News