USA: ట్రంప్ కు కాంగ్రెస్ ఝలక్.. అమెరికా షట్ డౌన్.. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిల్!

  • ట్రంప్-కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న పోరు
  • అమెరికా-మెక్సికో గోడ కోసం ట్రంప్ పట్టు
  • అంగీకరించని అమెరికా కాంగ్రెస్

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్, ఇతర కాంగ్రెస్ సభ్యుల మధ్య కొనసాగుతున్న విభేదాలు చిలికిచిలికి గాలివానగా మారాయి. తాజాగా మెక్సికో-అమెరికాల మధ్య గోడ నిర్మాణం కోసం తక్షణం రూ.35,070 కోట్లు(5 బిలియన్ డాలర్లు) విడుదల చేయాలన్న ఆయన డిమాండ్ కు కాంగ్రెస్ లోని విపక్ష డెమొక్రాట్లతో పాటు సొంత రిపబ్లికన్ పార్టీ నేతలే అంగీకరించలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు అవసరమైన ఫెడరల్ వ్యయ బిల్లుకు ఆమోదం తెలపకుండానే కాంగ్రెస్ వాయిదా పడింది. దీంతో అమెరికా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు పాక్షింగా స్తంభించిపోయాయి.

ఇలాంటి పరిస్థితిని అమెరికాలో షట్ డౌన్ గా వ్యవహరిస్తారు. తాజా షట్ డౌన్ దెబ్బకు దాదాపు 800,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇంటికి పరిమితం కానున్నారు. క్రైస్తవులకు పవిత్రమైన క్రిస్మస్ పర్వదినానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో చాలామంది అమెరికన్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోనున్నారు. తాజా షట్ డౌన్ తో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), హోంల్యాండ్ సెక్యూరిటీ, ఆరోగ్యశాఖ, వ్యవసాయం, విదేశాంగ శాఖ ఉద్యోగులు జీతాలు అందుకోలేరు.

కాగా, 2019, ఫిబ్రవరి 8 వరకూ ప్రభుత్వ వ్యయాల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు సెనెట్(ఎగువసభ) అంగీకరించింది. అయితే ఇందులో మెక్సికో-అమెరికా మధ్య గోడ నిర్మాణం విషయాన్ని చేర్చకపోవడంతో ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కాగా, ఈ షట్ డౌన్ ను తొలగించేందుకు ఫెడరల్ వ్యయ బిల్లుపై ఈరోజు మరోసారి అమెరికా కాంగ్రెస్ సమావేశం కానుంది. అమెరికాకు మెక్సికో నుంచి వలసలను నివారించేందుకు గోడ నిర్మించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా షట్ డౌన్ కు డెమొక్రాట్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో ఈ ఏడాదిలో మూడుసార్లు షట్ డౌన్ సంభవించింది.

More Telugu News