Andhra Pradesh: నేడు శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష.. హాజరుకానున్న చంద్రబాబు!

  • కేంద్రం వైఖరిని ఎండగట్టనున్న టీడీపీ అధినేత
  • రామ్మూర్తి నాయుడు స్టేడియంలో వేదిక ఏర్పాటు
  • సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు

ప్రత్యేహోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీడీపీ చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా వేదికయింది. జిల్లాలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఈరోజు జరగనున్న ధర్మపోరాట దీక్షలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఏపీలో ఏడు వెనుకపడ్డ జిల్లాలకు కేటాయించిన రూ.350 కోట్లను వెనక్కు తీసుకోవడం సహా కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఈ సదస్సులో నేతలు నిలదీయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నష్టపోయిందో నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. మరోవైపు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. 2014లో ఏపీ పునర్విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేంద్రం తీవ్రంగా విఫలం అయిందని తెలిపారు.

ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీ, విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ సహా ఇచ్చిన ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకే ఈ దీక్షను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీకాకుళంలో కొత్తగా నిర్మించిన టీడీపీ జిల్లా కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.

More Telugu News