Telangana: అవినీతి దందాకు కొత్త పంథా.. వీఆర్వోను అరెస్ట్ చేసిన ఏసీబీ!

  • లంచాల రుచిమరిగిన మల్కాపూర్ వీఆర్వో
  • నగదు ఇవ్వాలని నిరుద్యోగికి వేధింపులు
  • కటకటాల వెనక్కి నెట్టిన ఏసీబీ అధికారులు

అవినీతి రుచి మరిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచాల స్వీకరణకు కొత్త పద్ధతిని కనిబెట్టాడు. లంచం తీసుకుంటే అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకుంటారన్న అనుమానంతో టెక్నాలజీకి పనిచెప్పాడు. అయితే అందుకు కూడా సిద్ధమైన ఏసీబీ అధికారులు సదరు ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కునెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని గోదావరిఖని మల్కాపూర్‌కు చెందిన బి.కుమారస్వామి తన పేరుతో పాటు తండ్రి పేరులో మార్పుకోసం రామగుండం ఎమ్మార్వో ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలంటే రూ.14,000 లంచంగా ఇవ్వాలని మల్కాపూర్ వీఆర్వో మల్లేశం డిమాండ్ చేశాడు. అయితే తాను నిరుద్యోగిననీ, అంత మొత్తంలో నగదును ఇచ్చుకోలేనని బాధితుడు మొరపెట్టుకున్నాడు. అయినా వీఆర్వో మనసు కరగలేదు.

ఈ నేపథ్యంలో బాధితుడు కుమారస్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు రూ.14,000 నగదును తీసుకెళ్లి ఇవ్వబోగా తీసుకునేందుకు మల్లేశం నిరాకరించాడు. ఈ మొత్తాన్ని మీ సేవా కేంద్రం ద్వారా తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలన్నాడు. అలాచేశాక వచ్చిన రసీదును తన బైక్ లో పెట్టమన్నాడు. బాధితుడు అలా చేయగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రసీదు సాయంతో వీఆర్వో మల్లేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నేడు కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

More Telugu News