sajjan kumar: సజ్జన్ కుమార్ కు నిరాశ.. లొంగిపోయే గడువు పొడిగింపు కుదరదన్న న్యాయస్థానం

  • సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్
  • లొంగిపోయేందుకు నెలరోజుల గడువు కోరిన సజ్జన్
  • గడువు పొడిగింపునకు కారణాలు కన్పించట్లేదు: హైకోర్టు

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సజ్జన్ కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నెల రోజులు గడువు కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో సజ్జన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. సజ్జన్ కు నెల రోజుల గడువు ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ ని కొట్టివేసింది.

గడువు పొడిగించేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 31 లోపు పోలీసుల ఎదుట సజ్జన్ లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి, తమ కుటుంబ, ఆస్తి వ్యవహారాలు పరిష్కరించాల్సి ఉన్నందున తాను లొంగిపోవడానికి మరో నెలరోజుల గడువు కావాలని సజ్జన్ కుమార్  తన పిటిషన్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News