Andhra Pradesh: నాకు దొరికే సమయం కూడా మీకు దొరకడం లేదా?: ఏపీ టీడీపీ నేతలపై చంద్రబాబు గుస్సా!

  • సమన్వయకర్తలను నియమించకపోవడంపై ఆగ్రహం
  • భేటీకి గైర్హాజరైన అయ్యన్న, జేసీ, శిద్ధా, మోదుగుల
  • సీనియర్లు కూడా మాటిమాటికీ చెప్పించుకోవద్దని హితవు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు తన నివాసంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సభత్వ నమోదు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో టీడీపీ నేతలు, మంత్రులు అలసత్వం వహించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ చాలా జిల్లాల్లో ఇంకా సమన్వయకర్తలను సైతం నియమించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నేతలకు ఈ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు సమయం దొరకడం లేదని నేతలు చెప్పడంతో చంద్రబాబు అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. ‘నాకు దొరికిన సమయం కూడా మీకు దొరకడం లేదా?’ అని ప్రశ్నించారు. ఈ భేటీకి టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, శిద్ధా రాఘవరావు, మోదుగుల, జేసీ ప్రభాకర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్ నేతలు కూడా పదేపదే చెప్పించుకోవడం సరికాదని హితవు పలికారు. ఏపీలో పదవులు వచ్చిన నేతలు ధీమాతో పని చేయడంలేదనీ, పదవులు రాని వారు నిస్పృహతో పనిచేయడం లేదని అన్నారు. 

More Telugu News