chidambaram: ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చిదంబరం సూచన

  • రాఫెల్ డీల్ పై జరుగుతున్న చర్చకు దూరంగా ఉండండి
  • ఈ అంశంపై మాట్లాడాలనుకుంటే నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించండి
  • 126 విమానాలు కాకుండా కేవలం 36 మాత్రమే ఎందుకు కొంటున్నారని అడగండి

రాఫెల్ డీల్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికార, విపక్షాల మాటల యుద్ధంతో పార్లమెంటు సమావేశాలు కూడా సజావుగా సాగడం లేదు. మరోవైపు, ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడుతూ, రాఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ కు చాలా అవసరమని చెప్పారు.

ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లు రాఫెల్ ఉదంతంపై జరుగుతున్న చర్చకు దూరంగా ఉండాలని సూచించారు. తాను ఎయిర్ ఫోర్స్ చీఫ్ ను ఒత్తిడి చేయడం లేదని... ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లను ఈ అంశానికి దూరంగా ఉండాలని మాత్రమే కోరుతున్నానని చెప్పారు. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈ అంశంపై మాట్లాడాలనుకుంటే నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించాలని అన్నారు. 126 విమానాల అవసరం ఉంటే... కేవలం 36 ఎయిర్ క్రాఫ్ట్ లను మాత్రమే ఎందుకు కొనుగోలు చేస్తున్నారని అడగాలని సూచించారు.

రాఫెల్ డీల్ పై పార్లమెంటులో ఇప్పటికే చర్చ జరిగిందని, కానీ ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల తాము సంతృప్తికరంగా లేమని చిదంబరం అన్నారు. రాఫెల్ డీల్ సక్రమంగా ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. జేపీసీని ఏర్పాటు చేయాలంటూ తాము చేస్తున్న డిమాండ్ కు ప్రజలు మద్దతివ్వాలని కోరారు.

20 శాతం తక్కువ ధరకే రాఫెల్ డీల్ ను కుదుర్చుకున్నామంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం మండిపడ్డారు. తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నప్పుడు కేవలం 36 విమానాలే ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. మిగిలిన 126 విమానాల కొనుగోలుకు ఎందుకు అగ్రిమెంట్ చేసుకోలేదని అన్నారు. 

More Telugu News