BJP: సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో 22 మంది నిందితులూ నిర్దోషులే.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు!

  • 22 మంది నిందితుల్ని విడిచిపెట్టిన కోర్టు
  • వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని వెల్లడి
  • మోదీ- అమిత్ షా హయాంలో జరిగిన ఎన్ కౌంటర్

త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ అధికార బీజేపీకి భారీ ఊరట లభించింది. 2005 సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో 22 మంది నిందితులను నిర్దోషులని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలను సమర్పించలేక పోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో 210 మంది వాంగ్మూలం ఇవ్వగా, 92 మంది కేసు విచారణ క్రమంలో మాట మార్చారని కోర్టు చెప్పింది. ఇక ఈ కేసు నిందితులలో ఎక్కువ మంది పోలీసు అధికారులే కావడం గమనార్హం.

2005, నవంబర్ 22న సోహ్రబుద్దీన్ షేక్, ఆయన భార్య కౌసర్ బీలను గుజరాత్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మరుసటి ఏడాది సోహ్రబుద్దీన్ అనుచరుడు తులసీరాం ప్రజాపతిని రాజస్తాన్ పోలీసులు, గుజరాత్ పోలీసుల సంయుక్త టీమ్ హతమార్చింది. అయితే నేరాల అణచివేత విషయంలో గుజరాత్ ను దేశానికి ఓ మోడల్ గా తీర్చిదిద్దేందుకే ఈ నకిలీ ఎన్ కౌంటర్లు జరిగాయని వాదనలు వినిపించాయి. ఈ ఎన్ కౌంటర్ల వ్యవహారాన్ని బూచిగా చూపుతూ బీజేపీని కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్షాలు ఇన్నాళ్లు ఇరుకునపెడుతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో అప్పటి గుజరాత్ హోంమంత్రి, ప్రస్తుత బీజేపీ చీఫ్ అమిత్ షా, రాజస్తాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా సహా 23 మందిపై కేసు దాఖలయింది. అయితే విచారణలో భాగంగా అమిత్ షాను సీబీఐ కోర్టు నిర్దోషిగా ఇంతకుముందే ప్రకటించింది. తాజాగా మిగిలిన 22 మందిని కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

More Telugu News