TRS: టీఆర్ఎస్ జోరుకు బ్రేక్.. శాసనమండలికి బయలుదేరిన షబ్బీర్ అలీ, పొంగులేటి!

  • పార్టీ విలీనం అడ్డుకునేందుకు యత్నం
  • తొలుత ఫిరాయింపు దారులపై చర్యలకు డిమాండ్
  • స్వామిగౌడ్ ఛాంబర్ కు వెళ్లనున్న షబ్బీర్, పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా నెగ్గిన ఎం.ఎస్.ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమయింది. ఈ నేపథ్యంలో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చురుగ్గా పావులు కదిపారు. మండలిలో కాంగ్రెస్ కు ఆరు సీట్లే ఉన్న నేపథ్యంలో నలుగురితో పార్టీని టీఆర్ఎస్ లోకి విలీనం చేయించేందుకు ఈరోజు లేఖ ఇప్పించారు.

మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ అప్రమత్తమయ్యారు. మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై స్వామిగౌడ్ ను షబ్బీర్ అలీ నిలదీయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకున్న తర్వాతే విలీనంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరగా, మరో ఇద్దరు నేతల చేరికకు రంగం సిద్ధమయింది. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా ఉన్న షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి పదవీకాలం 2019, మార్చి నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

More Telugu News