Bollywood: నా పిల్లల భద్రత గురించి నిత్యం ఆందోళన చెందాల్సి వస్తోంది: నటుడు నసీరుద్దీన్ షా

  • నా పిల్లలను ఏదైనా అల్లరిమూక చుట్టుముడితే?
  • ‘మీదే మతం?’ అని ప్రశ్నిస్తే.. 
  • దానికి  నా పిల్లల వద్ద సమాధానం లేదు

ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షెహర్ లో గోవు కళేబరం  ఇటీవల  లభించడంతో హింసాత్మక సంఘటనలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెలరేగిన హింసలో  పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్, సుమీత్ అనే ఓ యువకుడు మృతి చెందారు.

ఈ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా స్పందిస్తూ, మన దేశంలో ఓ పోలీస్ అధికారి కంటే గోవు మృతి ఎక్కువైపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పిల్లల భద్రత గురించి ఆలోచిస్తుంటే తనకు భయమేస్తోందని అన్నారు. తన పిల్లలను ఏదైనా అల్లరిమూక చుట్టుముట్టి ‘మీదే మతం?’ అని వారు ప్రశ్నిస్తే, తన పిల్లల వద్ద సమాధానం లేదని అన్నారు. ఎందుకంటే, తమ పిల్లలకు మతపరమైన విద్యావిధానాన్ని ఇవ్వాలని అనుకోలేదని అన్నారు.

మంచైనా, చెడైనా అది మతం వల్ల ఎవరికీ రాదని అభిప్రాయపడ్డ నసీరుద్దీన్ షా, పిల్లలకు ఏది మంచీ? ఏది చెడు? అని మాత్రమే చెబుతామని అన్నారు. సమాజంలో ఇప్పటికే కావాల్సినంత విషాన్ని చొప్పించేశామని, ఇక, దాన్ని వెనక్కి తీసుకోవడం కుదిరే పని కాదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిని శిక్షించే విషయంలో మన వద్ద చాలా వెసులుబాటు ఉందని ఆయన విమర్శించారు. ‘ఇది మన ఇల్లు. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు’ అని నసీరుద్దీన్ పేర్కొన్నారు. 

More Telugu News