balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కొత్త పోస్టర్ .. తారకరాముడితో బసవతారకం!

  • రేపు సాయంత్రం ఆడియో వేడుక 
  • జనవరి 9న 'కథానాయకుడు'
  • ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు'      

ఇప్పుడు నందమూరి అభిమానులందరి దృష్టి ఎన్టీఆర్ బయోపిక్ పైనే వుంది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ వదులుతూ అంచనాలు పెంచేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ  .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ వున్న పోస్టర్ ను విడుదల చేశారు. బసవతారకం హార్మోనియం వాయిస్తూ వుంటే, ఆ పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లలోకి చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్, ఎన్టీఆర్ .. బసవతారకం దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయినట్టుగా అనిపిస్తోంది.

ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ఆరంభం కానుంది. మొదటిభాగమైన 'కథానాయకుడు' జనవరి 9వ తేదీన .. రెండవ భాగమైన 'మహానాయకుడు' ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ రెండు సినిమాలు బాలకృష్ణ కెరియర్లో రెండు ప్రత్యేకమైనవిగా మిగిలిపోతాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News