Kerala High Court: మలయాళ నటుడు దిలీప్‌కు షాకిచ్చిన కేరళ హైకోర్టు

  • నటిని వేధించిన కేసులో దిలీప్  అరెస్ట్.. విడుదల
  • సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన దిలీప్ కుమార్
  • ఎవరితో జరిపించాలో చెప్పే అధికారం మీకు లేదన్న కోర్టు

మలయాళ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. నటిని కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్‌ను గతేడాది జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. 85 రోజుల తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన దిలీప్ ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన కేసులో పోలీసులు అన్యాయంగా, పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. కాబట్టి తనపై వచ్చిన ఆరోపణల విషయంలో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరాడు. దిలీప్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. దానిని కొట్టివేసింది. ఏ ఏజెన్సీ దర్యాప్తు చేయాలో చెప్పే అధికారం నిందితుడికి లేదని పేర్కొంది.

 గతేడాది ఫిబ్రవరిలో 33 ఏళ్ల నటిపై కొచ్చిలో దాడి జరిగింది. కారులో వెళ్తున్న నటిని పల్సర్ సునీల్ తో కూడిన గ్యాంగ్ అడ్డగించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. మూడుగంటల పాటు ఆమెను కారులో లైంగికంగా వేధించారు. ఈ విషయం పోలీసులకు చెబితే ఈ సందర్భంగా తీసిన వేధింపుల వీడియోను సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె అదే రోజు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదైన ఐదు నెలల తర్వాత దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటితో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమెను వేధించేందుకు క్రిమినల్ గ్యాంగ్‌ను ఆమెపైకి ఉసిగొల్పారన్న ఆరోపణలపై అతడిపై కేసు నమోదైంది. ఈ కేసులో అతడు ఎనిమిదో ముద్దాయి.

More Telugu News