Sujana Chowdary: విచారణ సమయంలో తిండి కూడా పెట్టలేదన్న సుజనా చౌదరి.. తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి

  • ఆహారం ఇవ్వకుండా విచారించారన్న సుజనా
  • మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్న కోర్టు
  • సుజనా ఆరోపణలను ఖండించిన ఈడీ

టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజానా చౌదరి ఇళ్లపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరిని అధికారులు విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. అయితే, విచారణ సందర్భంగా తనకు ఆహారం కూడా పెట్టలేదని సుజనా చౌదరి బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు రోజులు విచారించిన అధికారులు తనకు భోజనం పెట్టేందుకు నిరాకరించారని ఆరోపించారు. సుజనా చౌదరి ఆరోపణలపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. తిండి పెట్టకుండా విచారించింది నిజమే అయితే, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈడీ తరపు న్యాయవాది మాత్రం సుజనా చౌదరి ఆరోపణలను ఖండించారు. తాము ఆహారం ఇవ్వాలనే అనుకున్నామని, తీసుకునేందుకు ఆయనే నిరాకరించారని పేర్కొన్నారు. ఒక్క అరటి పండు మాత్రమే తీసుకున్నారని తెలిపారు. సుజనా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తాము చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి అఫిడవిట్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. దీనికి అంగీకరించిన కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. సుజనా దాఖలు చేసే అఫిడవిట్‌పై స్పందించాలని ఈడీ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

More Telugu News