Andhra Pradesh: ఏపీకి పరిశ్రమలు రావట్లేదంటారు.. భూములిస్తే కుంభకోణాలంటారు!: ప్రతిపక్షాలపై లోకేశ్ ఫైర్

  • అసెంబ్లీకి రాని నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు
  • ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలకు భూములిస్తున్నాం
  • ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

ఏపీకి పరిశ్రమలు రావట్లేదంటారు.. పరిశ్రమలకు భూములు కేటాయిస్తే కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు.. అంటూ ప్రతిపక్షాలపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆరు ఐటీ కంపెనీలను ఒకే రోజు ఆయన ప్రారంభించారు.

అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, హెచ్సీఎల్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ వంటి ప్రముఖ సంస్థలను ఏపీకి తీసుకొచ్చామని, అటువంటి సంస్థలకు భూములు కేటాయిస్తే కుంభకోణం జరిగిందంటూ అసెంబ్లీకి రాని నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధికి ఈ విధంగా ఎందుకు అడ్డుపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలకు భూములిస్తున్నా ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

హెచ్సీఎల్ సంస్థకు భూములు కేటాయించడంపై బీజేపీ, వైసీపీ లు పదేపదే ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. హెచ్సీఎల్ సీఎఫ్ఓ ఈమధ్య తనకు ఓ మెస్సేజ్ పెట్టారని, ఏపీలోని ప్రతిపక్షాలు తమపై ఈ విధంగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయని ఆ మెస్సేజ్ లో తనను అడిగారని లోకేశ్ ప్రస్తావించారు. ఏం లేదని చెప్పి, వారిని సముదాయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఫలానా కంపెనీకి డబ్బులిచ్చారనో, ఫలానా చోట తప్పు చేశామనో చూపించాల్సిందిగా ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నానని, ఈ విధంగా తాను సవాల్ చేయడం పదిహేనో సారి కావచ్చని లోకేశ్ వ్యాఖ్యానించారు.

More Telugu News