వారు టీఆర్ఎస్ లో చేరుతున్నారనే వార్తలు నాకు తెలియదు: సీతక్క

19-12-2018 Wed 15:08
  • ములుగు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలి
  • ములుగును జిల్లా చేస్తామని కేసీఆర్ గతంలో చెప్పారు
  • మంగపేట్ నుంచి రాజపేట్ ను ప్రత్యేక మండలంగా చేయాలి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలు తనకు తెలియదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలనే తీర్పును ప్రజలు ఇచ్చారని చెప్పారు. ప్రజాకూటమి ఓటమికి గల కారణాలను పార్టీ విశ్లేషిస్తోందని తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆమె కలిశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ములుగు జిల్లాలో పలు మండలాలను కలపాలని విన్నవించారు.

అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, ములుగు నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన సందర్భంగా ములుగును ప్రత్యేక జిల్లా చేస్తామని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారని... హామీ మేరకు ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. మంగపేట్ నుంచి రాజపేట్ ను ప్రత్యేక మండలంగా చేయాలని అన్నారు.