Telangana: కేసీఆర్ పై వ్యతిరేకత ఉంది.. అలాంటప్పుడు టీఆర్ఎస్ ఎలా గెలిచింది?: కొండా సురేఖ

  • అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టారు
  • ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్లు వెచ్చించారు
  • టీఆర్ఎస్ పై మండిపడ్డ కొండా దంపతులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ పద్ధతులు, మార్గాల  ద్వారా టీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చిందని కొండా సురేఖ, ఆమె భర్త మురళి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారనీ, డబ్బును, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరించారని విమర్శించారు. హన్మకొండలోని తమ నివాసంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా దంపతులు మాట్లాడారు.

తెలంగాణ అంతటా కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందనీ, అలాంటప్పుడు టీఆర్ఎస్ ఎన్నికల్లో ఎలా గెలుపొందిందని ప్రశ్నించారు. చింతమడక గ్రామంలోనే సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ను ప్రజలు ఘోరావ్‌ చేసిన విషయాన్ని సురేఖ గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలు ఒక్కో నియోజకవర్గంలో రూ.30 నుంచి రూ.50 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారనీ, కరపత్రాలను సైతం పంచనివ్వలేదని వాపోయారు. కేటీఆర్ ను టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రిని చేయబోతున్నారనీ, అందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.

More Telugu News