ramyakrishna: టీవీ సీరియల్ గా జయలలిత జీవితచరిత్ర .. ప్రధాన పాత్రధారిగా రమ్యకృష్ణ

  • బుల్లితెరపై జయలలిత జీవితచరిత్ర 
  • వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మొదలు
  • 30 ఎపిసోడ్స్ గా ప్రసారం  

అందాల కథానాయికగాను .. సమర్థవంతురాలైన రాజకీయ నాయకురాలిగాను జయలలిత ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి. అలాంటి ఆమె జీవితచరిత్రను ఆవిష్కరించడానికి తమిళ దర్శకులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఒక వైపున దర్శకురాలు ప్రియదర్శిని .. మరో వైపున భారతీరాజా ఆ ప్రయత్నాల్లోనే వున్నారు.

ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను ధారావాహికగా తీయడానికి గౌతమ్ మీనన్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఆయనే దర్శకత్వం చేస్తాడా .. నిర్మాతగా మాత్రమే ఉంటాడా? అనే విషయంలో స్పష్టత లేదు గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయట. 30 ఎపిసోడ్స్ గా ఈ ధారావాహిక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రసారమవుతుందని అంటున్నారు. జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారని చెబుతున్నారు. టీవీలో ప్రసారమైన తరువాత ఇది వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో వుంటుందట. 

More Telugu News