Cold: చంపేసిన చలిపులి... టీఎస్, ఏపీల్లో రెండు రోజుల్లో 34 మంది మృతి!

  • ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు
  • ఏపీలో 23 మంది, టీఎస్ లో 11 మంది మరణం
  • విశాఖ జిల్లాలో ఆరుగురి మృతి

పెథాయ్ తుపాను ప్రభావానికి తోడు, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులు ప్రాణాలను బలిగొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోగా, చలి తీవ్రతకు తట్టుకోలేక, సోమ, మంగళవారాల్లో 34 మంది ప్రాణాలు వదిలారు. ఏపీలో 23 మంది, తెలంగాణలో 11 మంది చలి కారణంగా మరణించినట్టు అధికారులు తెలిపారు. ఒక్క విశాఖ జిల్లాలోనే ఆరుగురు మృత్యువాత పడగా, ప్రకాశంలో ఐదుగురు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. వీరిలో వృద్ధులే అధికం.

కాగా, హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకన్నా తక్కువకు, రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. నిన్న శివారు ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 18.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శీతల గాలుల కారణంగా వాతావరణం బాగా చల్లబడిందని, రానున్న మూడు, నాలుగు రోజుల్లో చలి పులి తన పంజాను మరింత బలంగా విసరనుందని అధికారులు హెచ్చరించారు. బయట తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News