Guntur District: నడి రోడ్డుపై వలపు వల... మాటువేసి పట్టేసిన గుంటూరు పోలీసులు!

  • జాతీయ రహదారిపై నిలబడే యువతులు
  • బుట్టలో పడిన వారిని పక్కకు తీసుకెళ్లి దోపిడీ
  • ముగ్గురు యువతులు సహా ఏడుగురి అరెస్ట్

అది గుంటూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారి. నడిరోడ్డుపై అర్ధరాత్రి మాటువేసే కొందరు యువతులు, అందాలు ఒలకబోస్తూ, అటుగా వచ్చే వాహనాలను ఆపుతారు. అమ్మాయిలు ఆపుతున్నారన్న ఉద్దేశంతో ఎవరైనా వాహనం ఆపితే, వారిని మాటల్లో పెట్టి, వ్యభిచారం కోసం పక్కకు తీసుకెళతారు. వెంటనే ఆ పక్కనే నక్కివున్న నలుగురు వ్యక్తులు, దాడి చేసి వారి వద్ద ఉన్న డబ్బు, నగలు, సెల్ ఫోన్లు దోచేసుకుంటారు. ఎంతో కాలంగా ఈ దందా సాగుతుండగా, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, దీనిపై ఉప్పందుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం మాటువేసి ముగ్గురు యువతులను, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ మూర్తి వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఓ టీమ్ గా ఏర్పడిన ఏడుగురు ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఆడవారిని చూసి వాహనాన్ని ఆపే డ్రైవర్లు, ఇతర వాహనదారులు వీరి టార్గెట్. దీని గురించి తెలుసుకున్న పోలీసులు, సోమవారం తెల్లవారుజామున చినకోండ్రుపాడు కాటూరి మెడికల్‌ కాలేజీ వద్ద మాటు వేశారు. ఆ దిశగా వచ్చే వాహనాలను పరిశీలిస్తున్నారు. తన్నీరు అంకమ్మరావు అనే వ్యక్తి, తన ఆటోలో కాటూరి వైపు వెళుతుండగా ఒక్కసారిగా యువతులు రోడ్డుపైకి వచ్చి చెయ్యెత్తారు. తమను చూసి ఆశపడ్డ అంకమ్మరావును వారు పక్కకు తీసుకెళ్లగానే, పురుషులు వచ్చి దాడి చేసి రూ. 4,750 నగదు, సెల్ ఫోన్ ను లాక్కున్నారు.

దీన్ని చూస్తున్న పోలీసులు మెరుపుదాడి చేసి, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 25 సంవత్సరాల లోపు వయసువారే కావడం గమనార్హం. రహదారిపై రాత్రిపూట దోపిడీలు చేస్తున్న వీరిని చితల దుర్గా ప్రసాద్‌, దొడ్డా రాజకుమార్‌, వేముల అనిల్‌, జీ ఏసుబాబు, షేక్‌ మాబులా, అంగడి లక్ష్మి, వంతల తిరుపతమ్మ గా గుర్తించామని తెలిపారు. వీరు గతంలో సత్తెనపల్లి, పేరేచర్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా దోపిడీలు చేసినట్టు గుర్తించామన్నారు. నిందితులను రిమాండ్ కు పంపామని వెల్లడించారు.

More Telugu News