Kodangal: కొడంగల్ లో ఓటమి పాలైన వేళ... లోక్ సభపై కన్నేసిన రేవంత్ రెడ్డి!

  • కొడంగల్ నుంచి ఓటమిపాలైన రేవంత్
  • మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి
  • చేవెళ్ల నుంచి బరిలోకి దిగే ప్రయత్నాల్లో మహేందర్ రెడ్డి

ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ పడి ఓటమి పాలైన రేవంత్ రెడ్డి, ఇప్పుడు లోక్ సభ స్థానంపై కన్నేశారని తెలుస్తోంది. రేవంత్ ఓటమి కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ నే ఇవ్వగా, వచ్చే సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ పడేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని అధిష్ఠానానికి రేవంత్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా సాగాలంటే, మహబూబ్ నగర్ నుంచి గెలుపు కీలకమని భావిస్తున్న రేవంత్ అక్కడి నుంచి అవకాశం రాకుంటే, మరో చోటినుంచైనా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదే సమయంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న మహేంద్ర రెడ్డి తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోగా, ఆయన కూడా ఎంపీ సీటుపై కన్నేశారు. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహేందర్ రెడ్డి చెప్పగా, అందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని, ఇప్పటి నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ ఉండాలని ఆయన్ని ఆదేశించినట్టు సమాచారం.

More Telugu News