ISRO: భారత సైనిక శక్తికి ఇస్రో అందిస్తున్న అస్త్రం 'యాంగ్రీ బర్డ్'.. నేడే ప్రయోగం!

  • నేడు జీ-శాట్ 7ఏ ప్రయోగం
  • సాయంత్రం 4.10 గంటలకు నింగిలోకి
  • సైనిక అవసరాలు తీరుస్తుందన్న ఇస్రో

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్న భారత సైన్యానికి ఇస్రో మరో అస్త్రాన్ని నేడు అందించనుంది. మిలటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ జీ-శాట్ 7ఏ (యాంగ్రీ బర్డ్)ను జీఎస్ఎల్వీ-ఎఫ్ 11 రాకెట్ ద్వారా నేటి సాయంత్రం 4.10 గంటలకు ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరుగనుండగా, కక్ష్యలోకి చేరిన తరువాత భారత వాయుసేనకు ఈ శాటిలైట్ అందించే సేవలు దేశ రక్షణ వ్యవస్థకు ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వార్నింగ్ కంట్రోల్, డ్రోన్లకు దిశ, గ్రౌండ్ స్టేషన్లకు సమాచార బట్వాడా తదితరాలను ఈ కొత్త శాటిలైట్ సమర్ధవంతంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ శాటిలైట్ విశేషాలు పరిశీలిస్తే, దీని బరువు 2,250 కిలోలు. సైన్యం అవసరాల నిమిత్తం 2013లో ప్రయోగించిన జీ శాట్ 7 (రుక్మిణి) ఇప్పటికీ సేవలందిస్తుండగా, దానికి తోడుగా జీ శాట్ 7ఏ చేరనుంది. ఈ శాటిలైట్ ప్రయోగం ఈ సంవత్సరం ఇస్రో చేపడుతున్న 17వది కాగా, ఈ సంవత్సరానికి ఇదే చివరిది కానుంది.

More Telugu News