Andhra Pradesh: స్నేహితురాలి ఫొటోలతో నగ్న చిత్రాల మార్ఫింగ్.. యువకుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు!

  • ఫేస్ బుక్ లో పరిచయమైన యువతి
  • సోషల్ మీడియాలో ఫొటోలు తీసుకున్న ప్రబుద్ధుడు
  • మార్ఫింగ్ చేసి వేధింపులు

స్నేహితుడని నమ్మినందుకు ఓ ప్రబుద్ధుడు యువతికి చుక్కలు చూపించాడు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను సేకరించి అశ్లీల ఫొటోలుగా మార్ఫింగ్ చేశాడు. అనంతరం వాటితో ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అధికారులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో ఉంటున్న మహ్మద్‌ మొయిజుద్దీన్‌(22)కు ఇటీవల ఫోన్ లో యువతి పరిచయమయింది. ఈ నేపథ్యంలో యువతి సోషల్ మీడియా అకౌంట్ల గురించి తెలుసుకున్న నిందితుడు ఆమె ఫొటోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి యువతి ఫేస్ బుక్ ఖాతాలోనే పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో సదరు ప్రబుద్ధుడు స్పందిస్తూ..‘ఇదొక్కటే కాదు.. నీ పేరు మీద ఇంకా 7 అకౌంట్లు ఉన్నాయి. చూసుకో పో’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

దీంతో బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై తొలుత కేసు నమోదుచేసిన అధికారులు, సదరు అకౌంట్లను బ్లాక్ చేశారు. అనంతరం నిందితుడు మొయిజుద్దీన్ కదలికలపై నిఘా ఉంచారు. కాలాపత్తర్ ప్రాంతంలో తిరుగుతున్న అతడిని పోలీసులు పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో కోర్టు ముందు హాజరుపరచి కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News