Andhra Pradesh: మద్దెలచెరువు సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం!

  • రూ.20 వేలు జరిమానా విధించిన నాంపల్లి కోర్టు
  • నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసిన న్యాయస్థానం
  • 92 మంది సాక్షుల వాంగ్మూలాల స్వీకరణ

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్టు గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం, అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. అంతేకాకుండా ఆయుధాల చట్టం కేసులో మరో పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సూరి హత్య, ఆయుధాల చట్టం కింద భాను సన్నిహితుడు మన్మోహన్ సింగ్ కు నాంపల్లి కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధించింది. ఈ కేసులో మిగతా నిందితులు సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా విడుదల చేసింది.

హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో 2011,జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. 2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది.

More Telugu News