Narendra Modi: ఢిల్లీలో ఓ మొండోడు ఉన్నాడు.. త్రీడీ ఎఫెక్టులతో ప్రధాని అయ్యాడు!: విచిత్ర వేషధారణలో శివప్రసాద్ నిరసన

  • పాటల ద్వారా వినూత్న నిరసన
  • పార్లమెంటు ముందు టీడీపీ నేతల ఆందోళన
  • ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుకు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ టీడీపీ నేతలు ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఏపీకి హోదా ఇస్తామన్న మోదీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని వెంటనే కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్, శివప్రసాద్, రామ్మోహన్ నాయుడు, మురళీ మోహన్ సహా పలువురు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు వేషం ధరించిన టీడీపీ నేత ఎన్.శివప్రసాద్, మోదీ ప్రభుత్వ తీరును పాట రూపంలో తూర్పారపట్టారు.

‘ఏం పిల్లడో ఢిల్లీ వస్తవా.. ఏం అమ్మాయి ఢిల్లీ వస్తవా.
ఢిల్లీలోనే మొండోడు(ప్రధాని మోదీ) ఉన్నడు.
 మొండోడిని కాదు.. నేను మొనగాడిని అంటడు.
డ్రస్సులేమో తెగ జోరుగా ఏస్తడు.
ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటడు.
త్రీడీ ఎఫెక్టుతో ప్రధాని అయ్యుండు.
ప్రజల గురించి అసలు ఆలోచించడు’
అంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.

ప్రత్యేకహోదా నుంచి ప్యాకేజీకి దిగజారిన మోదీ, ప్యాకేజీని తర్వాత లీకేజీ చేశాడని శివప్రసాద్ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి సాయం కావాలంటే చెంబు నీళ్లు, తట్టెడు మట్టి ముఖాన కొట్టారని విమర్శించారు. 2019లో మోదీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

More Telugu News