Karnataka: ఆ ప్రసాదంలో ప్రమాదకరమైన విష పదార్థం: ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

  • గోపుర శంకుస్థాపన విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం
  • ప్రసాదంలో పురుగు మందు కలిపిన మరో వర్గం 
  • 14 మంది మృతి.. 80 మంది ఆసుపత్రి పాలు

14 మంది మృతికి కారణమైన ప్రసాదంలో అత్యంత ప్రమాదకరమైన పదార్థాన్ని కనుగొన్నట్టు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం బయటపడినట్టు తెలిపింది. ప్రసాదం నమూనాల్లో మానవులకు అత్యంత ప్రమాదకరమైన మోనోక్రోటోఫాస్, ఆర్గానోఫాస్పేట్ అవశేషాలు ఉన్నట్టు తేలిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యక్తులను ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కొందరు నిందితులు గ్రామం విడిచి పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటన వెనక ఎవరునున్నారు, ఎవరు చేశారు అనే విషయం త్వరలోనే బయటపడుతుందన్నారు.

చామరాజనగర జిల్లాలోని సులవది గ్రామంలో ఉన్న మారెమ్మ ఆలయంలో గోపుర శంకుస్థాపన సందర్భంగా పంపిణీ చేసిన ప్రసాదం తిన్న భక్తుల్లో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14 మంది మృతి చెందారు. భక్తులు పడేసిన ప్రసాదం తిన్న  60 కాకులు కూడా ఆలయ పరిసరాల్లో చచ్చిపడి ఉండడాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గోపుర శంకుస్థాపనను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం ప్రసాదంలో పురుగు మందు కలిపినట్టు అనుమానించారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదికలోనూ ఇదే విషయం బయపడింది.

More Telugu News