maddela cheruvi suri: మద్దెల చెరువు సూరి హత్య కేసు.. రేపు తుదితీర్పు

  • 2011లో సూరిని కాల్చి చంపిన భాను కిరణ్
  • 2012లో భానుకిరణ్ అరెస్టు
  • ఏడేళ్ల తర్వాత వెలువడనున్న తుది తీర్పు

రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్టు గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో హైదరాబాదు, నాంపల్లి కోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది. జనవరి 4, 2011లో హైదరాబాద్ లోని యూసప్ గూడ ప్రాంతంలో సూరి కారులో ప్రయాణిస్తుండగా ఆయన అనుచరుడు భాను కిరణ్ కాల్చి చంపాడు. 2012లో భానుకిరణ్ ని జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా, ఈ కేసులో ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టులో విచారణ సాగించారు. కాల్చి చంపింది భాను కిరణేనని సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, ప్రధాన నిందితుడి నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, ఈ హత్యకు సంబంధించి భానుకిరణ్ కి మిగిలిన నిందితులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్టు సమాచారం. సూరి హత్య కేసులో ఆరుగురి పేర్లను పోలీసులు ఛార్జిషీట్ లో చేర్చారు. 92 మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో భాను కిరణ్ తో పాటు మరో ముగ్గురికి హైదరాబాద్ లోని స్థానిక కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.    

More Telugu News