Chandrababu: బీజేపీ సీఎంలను తీసుకొస్తే చంద్రబాబు క్లాసులు చెబుతారు: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ సెటైర్

  • తుపాను తీవ్రత తగ్గుతోందన్నాకే బాబు వెళ్లారు
  • బాబు సిన్సియార్టీని అనుమానించక్కర్లేదు
  • చంద్రబాబు ఓ బ్లూ బుక్

ఏపీలో తుపాను కారణంగా ప్రజలు అల్లాడుతుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ, పెథాయ్ తుపాను తీవ్రత తగ్గుతుందని సంబంధిత అధికారులు నిర్ధారించిన తర్వాతే ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లారని అన్నారు.

 కేవలం, కొన్ని గంటలు మాత్రమే ఆయన అక్కడ ఉన్నారని, ఆ తర్వాత వెంటనే వచ్చారని, వైజాగ్ లో దిగి తుపాను ప్రభావిత ప్రాంతాలకు వెళదామనుకుంటే వాతావరణం అనుకూలించ లేదని చెప్పారు. అయినప్పటికీ, ఆయా పనులను మంత్రులు నారాయణ, చిన రాజప్ప, లోకేష్ లు పర్యవేక్షించాలని బాబు ఆదేశించారని, ఆ పనుల్లో వారు తలమునకలై ఉన్నారని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చంద్రబాబుకు తెలియజేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబునాయుడి సిన్సియార్టీని ప్రతిపక్షాలు అనుమానించాల్సిన అవసరం లేదని, ఆయన అమెరికాలో ఉన్నా సరే ఏపీ ప్రజలకు ఆయన మేలు చేస్తారని వ్యాఖ్యానించారు. తుపాన్లు సంభవించినప్పుడు ఎలా పనిచేయాలనే విషయంలో ఆయన ఓ బ్లూ బుక్ అని చెప్పుకొచ్చారు. అవసరమైతే, చంద్రబాబుతో బీజేపీ సీఎంలకు క్లాసులు చెప్పిస్తామని, వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారంటూ సెటైర్లు విసిరారు.

More Telugu News