kcr: మార్చి 31 నాటికి ప్రతి ఇంటికి ‘మిషన్ భగీరథ’ నీరు: సీఎం కేసీఆర్

  • ఏప్రిల్ 1 నుంచి  బిందెపట్టుకుని రోడ్లపై కనిపించొద్దు
  • అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీరు అందివ్వాలి
  • ఈ విషయంలో ఖర్చుకు వెనుకాడొద్దు

మిషన్ భగీరథపై ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నీరందించాలని, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్కరూ మంచినీటి కోసం బిందెపట్టుకుని రోడ్ల మీద కనిపించొద్దని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీరు అందివ్వాలని, ఈ విషయంలో ఖర్చుకు వెనుకాడొద్దని సూచించారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

దళితవాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అచ్చంపేట, సిర్పూర్ నియోజకవర్గాలు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల పల్లెలకు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైనా సరే మంచినీరు సరఫరా చేయాలని ఆదేశించారు. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్లు సరఫరా కాని ఒక్క ఇల్లు కూడా వుండద్దని, ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచి నీళ్లు ఇవ్వడంతోనే తన బాధ్యత తీరిపోదని, ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా జరగాలని అన్నారు. ఇప్సటివరకు ప్రజలు ఎక్కడికక్కడున్న వనరులతో అవసరాలు తీర్చుకున్నారని, ఒక్కసారి మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన మంచినీళ్లు తాగిన తర్వాత ప్రజలు మరోరకం నీళ్లు తాగలేరని అన్నారు. ఏ ఒక్కరోజు మంచినీళ్లు రాకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, దానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

కాగా, 23,968 ఆవాస ప్రాంతాలకు గాను 23,947 కు నీళ్లిస్తున్నామని, మరో 21 గ్రామాలకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉందని కేసీఆర్ కు అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి, మంచినీరు అందిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News