Vijayawada: పెథాయ్ తుపాను ఎఫెక్ట్ ... లోతట్టు ప్రాంతాలు జలమయం

  • నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
  • విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

ఏపీలో పెథాయ్ తుపాను కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక చిట్టినగర్, ఇస్లాంపేట, వన్ టౌన్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ పనుల నిమిత్తం తవ్విన గుంటలు వర్షపు నీటితో నిండిపోవడం గమనార్హం.

కాగా, కాకినాడ-యానాం మధ్య పెథాయ్ తుపాన్ తీరం దాటింది. క్రమంగా బలహీనపడుతున్న ‘పెథాయ్’ ఒడిశా దిశగా పయనిస్తోంది. దీని ప్రభావం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, కొబ్బరిచెట్లు విరిగిపడుతున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తంలో కుండపోత వర్షం కురుస్తోంది. కోనసీమ అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. 3 అడుగుల మేరకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి.

More Telugu News