Chandrababu: రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించిన చంద్రబాబు

  • టెలీకాన్ఫరెన్స్ ద్వారా యంత్రాంగం అప్రమత్తం 
  • పంటలు తడిసిపోకుండా చూడాలి
  • ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

పెను తుపానుగా మారిన పెథాయ్‌ తీరానికి చేరువ అవుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రభావిత జిల్లాల కలెక్టర్లను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. పెథాయ్‌ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు తడిసిపోకుండా చూడాలని, రైతులకు అన్ని విధాలా సహాయపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేయింబవళ్లు దాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.

పెథాయ్ ప్రమాదం పొంచి ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహా 2వేల మందిని మోహరించినట్లు వెల్లడించారు. పెథాయ్ తీరం దాటనున్న నేపథ్యంలో 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అంచనా వేయడంతో ఆ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

More Telugu News