Pethai: తీరానికి దగ్గరగా వచ్చేసిన పెథాయ్... 14 విమానాలు రద్దు... కదలని బస్సులు!

  • తీరానికి 100 కి.మీ. దూరంలో తుపాను
  • మరో నాలుగు గంటల్లో తీరాన్ని తాకే అవకాశం
  • విశాఖ విమానాశ్రయంలో 200 మంది పడిగాపులు

గడచిన నాలుగు రోజుల నుంచి బంగాళాఖాతంలో బలపడుతూ, అటు అధికారులను, ఇటు ప్రజలను భయాందోళనలకు గురిచేసిన పెథాయ్ తుపాను కాకినాడకు అటూ, ఇటుగా ఉన్న యానాం - తుని ప్రాంతాలకు దగ్గరైంది. తీరానికి 100 కిలోమీటర్ల దూరంలోకి తుపాను కేంద్రం వచ్చేసింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతూ ఉండటంతో మరో నాలుగు గంటల్లో ఇది తీరాన్ని తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, తుపాను ప్రభావంతో ఇప్పటికే విశాఖలో భారీ వర్షాలు పడుతూ ఉండటంతో ఈ ఉదయం నుంచి టేకాఫ్ కావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. వారందరి బోర్డింగ్ పాస్ లను క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో, దాదాపు 200 మంది ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు. మరోవైపు విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. పలు గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, గాలుల తీవ్రత అధికమై, మరిన్ని చెట్లు పడి రాకపోకలకు అంతరాయం కలుగవచ్చన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News