Telangana: తొలుత మినీ క్యాబినెట్... ఆరుగురికే చాన్సన్న కేసీఆర్!

  • నెలాఖరులో విస్తరణ
  • ఆపై శాసనసభ సమావేశాలు
  • అప్పటివరకూ కేసీఆర్ బిజీ

గత వారంలో తనతో పాటు హోమ్ మంత్రిగా మహమూద్ అలీని ఎంపిక చేసుకుని ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, ఈ నెలాఖరులోగా మరోసారి మంత్రివర్గ విస్తరణను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. శాసనసభ సమావేశాలకు ముందుగా మినీ క్యాబినెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆయన, మలి దశలో 6 నుంచి 8 మందికి మాత్రమే మంత్రులుగా చాన్స్ ఇస్తారని తెలుస్తోంది.

ఆపై పంచాయతీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి, మిగతా మంత్రులను ఎంపిక చేసుకోవాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇతర పార్టీల నుంచి గెలుపొందిన వారిలో 8 నుంచి 12 మంది వరకూ టీఆర్ఎస్ లో చేరుతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, వారిలోనూ ఇద్దరు ముగ్గురికి మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.

రేపు, ఎల్లుండి కాళేశ్వరం, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిశీలనకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఆపై 21న హైదరాబాద్ కు వచ్చే రాష్ట్రపతి, 24 వరకూ ఇక్కడే బస చేస్తుండటంతో, ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో కేసీఆర్ బిజీగా ఉంటారు. ఆపై 26న ఢిల్లీకి వెళ్లి ప్రధానిని మర్యాద పూర్వకంగా కలుస్తారు. ఆపైనే నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.

వివిధ సమీకరణాలు, ప్రభుత్వ ప్రాథామ్యాలు, ప్రజల అవసరాలను బట్టి మంత్రివర్గ విస్తరణలో ఎంపికలు ఉంటాయని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీంతో పాతవారిలో చాలామందికి చాన్స్ లభించే అవకాశాలు లేనట్టేనని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. వ్యక్తుల కోసం కాకుండా, పని కోసం మంత్రులను నియమించుకుందామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదని, ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి మంత్రివర్గం లేకున్నా, పాలన సజావుగానే సాగుతుందని ఆయన చెప్పినట్టు సమాచారం.

More Telugu News