TV anchor: నోయిడా టీవీ యాంకర్ రాధిక హత్య కేసులో సీనియర్ యాంకర్ రాహుల్ అరెస్ట్

  • ప్రైవేటు న్యూస్‌ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న రాధిక
  • శుక్రవారం ఇంటిలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడి మృతి
  • సీనియర్ యాంకర్ రాహుల్‌పై అనుమానాలు

ప్రైవేటు న్యూస్ చానల్ యాంకర్ రాధిక కౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో సీనియర్ యాంకర్ రాహుల్ అవస్థిని నోయిడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నొయిడాలో సెక్టార్ 77లో నివసిస్తున్న రాధిక శుక్రవారం తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఆ సమయంలో రాహుల్ ఆమెతోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

అంతకుముందు రాహుల్ మాట్లాడుతూ.. రాధిక పడిపోయినప్పుడు తాను వాష్‌రూములో ఉన్నట్టు చెప్పాడు. అయితే, అతడు చెప్పిన వివరాలు పలు అనుమానాలకు తావిచ్చినట్టు పోలీసులు తెలిపారు. రాధిక కిందపడి మృతి చెందడానికి కొన్ని క్షణాల ముందు ఇద్దరూ బాల్కనీలో కనిపించినట్టు సెక్యూరిటీ గార్డు చెప్పినట్టు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్వేతభ్ పాండే తెలిపారు.

రాధికది హత్య కాదని తొలుత భావించామని, అయితే, ఆ తర్వాత విచారణలో రాహుల్ పాత్ర కచ్చితంగా ఉండే అవకాశం ఉందని అనుమానించినట్టు చెప్పారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నామని, నేడు అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. రాధిక కటుుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాహుల్‌పై  ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పాండే వివరించారు.

జైపూర్‌కు చెందిన 25 ఏళ్ల రాధిక ఈ ఏడాది సెప్టెంబరులో నోయిడా వచ్చి ఓ ప్రైవేటు న్యూస్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయలుదేరిన రాధిక 10:48 గంటలకు ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమెను రాహుల్ కలిశాడు. ఆమె ఇంటిలో ఖాళీ బీరు బాటిళ్లు, మద్యం సీసాలు కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.

రాధికకు మద్యం తాగే అలవాటు లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నందుకు సంతృప్తిగానే ఉన్నా, అతనిపై హత్య కేసు నమోదు చేయకపోవడం బాధగా ఉందని రాధిక అంకుల్ యోగేష్ కౌషిక్ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News