Kerala: 5 రోజుల దీక్షతో శబరిమలకు 30 మంది అతివలు... ఆదివారం వస్తున్నామని కబురుతో కలకలం!

  • సీఎం కార్యాలయానికి వర్తమానం
  • మరో 10 రోజులు మాత్రమే తెరచివుండే ఆలయం
  • పోలీసు రక్షణ కోరిన మహిళా కార్యకర్తలు సెల్వి, అమ్మణ్ణి

రుతుస్రావ వయసులో ఉన్న 30 మంది మహిళలు, తాము అయ్యప్ప దర్శనం నిమిత్తం 23వ తేదీ ఆదివారం వస్తున్నామని, తమకు దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో మరోసారి కలకలం రేగింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత, గతంలో రెండుసార్లు అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకోగా, మహిళలెవరూ స్వామిని దర్శించుకోలేకపోయారు.

ఆపై మండలపూజల నిమిత్తం గత నెల మూడో వారం నుంచి ఆలయం తెరచుకుంది. భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ మినహా మరే మహిళా స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఆలయం మరో 10 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఈ నేపథ్యంలో ఏకంగా 30 మంది తాము వస్తున్నామని సమాచారం ఇవ్వడం గమనార్హం.

వీరిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే అధికమని, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. తామంతా ఐదు రోజుల పాటు దీక్ష చేసి శబరిమలకు వస్తున్నట్టు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మహిళా హక్కుల సంఘం 'మనితి' నేతృత్వంలో మహిళల టీమ్ వస్తోంది.

"ఇప్పటివరకూ చాలా మంది మహిళలు అయ్యప్పను చేరుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు. వారంతా ఒంటరిగా వెళ్లారు. మేము మాత్రం ఓ గ్రూపుగా వెళుతున్నాం. రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఈ విషయాన్ని తెలియజేశాం. తమ వినతిని పోలీసులకు పంపినట్టు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది" అని మహిళా హక్కుల కార్యకర్త సెల్వి వ్యాఖ్యానించారు.

ఇదే టీమ్ లో భాగమైన ఆదివాశీ ఉమెన్ ఫోరమ్ కార్యకర్త అమ్మణ్ణి మాట్లాడుతూ, "మా టీమ్ లో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని ఇప్పుడే వెల్లడించబోము. పోలీసుల రక్షణ లేకుండా మేము శబరిమలకు చేరలేమని తెలుసు. మాకు పోలీసులు సహకరిస్తారనే భావిస్తున్నాం" అని అన్నారు.

ఇక మహిళల రాక వార్త బయటకు వచ్చిన తరువాత, శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 20 రోజులుగా తక్కువగా ఉన్న పోలీసు భద్రతను పరిస్థితిని బట్టి మరింతగా పెంచుతామని అధికారులు వెల్లడించారు.

More Telugu News