Manohar Parrikar: ముక్కులో పైపు.. పక్కనే వైద్యులు.. బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన గోవా సీఎం!

  • మండోవీ నదిపై వంతెన నిర్మాణం
  • మానస పుత్రిక ప్రాజెక్టును పరిశీలించిన పారికర్
  • వైరల్ అవుతున్న ఫొటోలు

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి ఆదివారం అందరినీ ఆశ్చర్యపరిచారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నప్పటికీ మండోవి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఢిల్లీ ఆసుపత్రిలో నెలలపాటు చికిత్స తీసుకున్న ముఖ్యమంత్రి తొలిసారి ఇలా వైద్యుల సాయంతో బయటకు వచ్చారు. ముక్కులో పైపుతో, పక్కనే వైద్యులతో వచ్చిన సీఎం నిర్మాణ పనులపై అధికారులతో మాట్లాడారు. నిర్మాణ పనులు చురుగ్గా సాగాలని, అనుకున్న సమయంలోనే నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు.

అలాగే, పంజిం సమీపంలో జువారి నదిపై నిర్మిస్తున్న మరో వంతెనను కూడా పారికర్ పరిశీలించారు. బ్రిడ్జి పనులను పర్యవేక్షించేందుకు పారికర్ ఆరు కిలోమీటర్లు ప్రయాణించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వచ్చే ఏడాదికి పూర్తికానున్న ఈ బ్రిడ్జి పనాజిని ఉత్తర గోవాతో కలుపుతుంది.

వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పారికర్ మాత్రం బ్రిడ్జి పర్యవేక్షణకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. ఈ ప్రాజెక్టును సీఎం తన మానసపుత్రికగా గతంలో చెప్పుకొచ్చారు.

పారికర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పర్యవేక్షణ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ముక్కులో ట్యూబుతో, తీవ్ర అస్వస్థతతో ఉన్న వ్యక్తిని బయటకు ఎలా రానిచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. తమాషా చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News