Pethai cyclone: కోస్తాను వణికిస్తున్న ‘పెథాయ్’.. అల్లకల్లోలంగా సముద్రం!

  • తీరం దిశగా కదులుతున్న తుపాను
  • కోస్తా జిల్లాలో హై అలెర్ట్
  • ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం

తీవ్ర తుపానుగా మారిన పెథాయ్ కోస్తాను వణికిస్తోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. నేటి సాయంత్రం కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 26 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతున్నట్టు చెప్పారు.

ఇది మచిలీపట్టణానికి 380 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 360 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతం అయినట్టు పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తూర్పుగోదావరి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్ నిరంతరం గమనిస్తోంది. కాకినాడ, భీమిలిలో ఏడో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.

 కోస్తాకు భారీ వర్ష సూచన ఉండడంతో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుపాను పరిస్థితిపై అధికారులతో మాట్లాడిన చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వం వద్దని, రాత్రింబవళ్లు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. తుపాను బాధితులకు తక్షణం సాయం అందేలా చూడాలని, ఆహారం నుంచి విద్యుత్తు వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News