Chandrababu: చంద్రబాబు మురికి కాలువలో మునిగి.. దానినే గంగానది అంటారు: జగన్ ఎద్దేవా

  • పెండింగ్ పనులు దగ్గరుండి చేయిస్తా
  • టీఆర్ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడారు
  • ఫోటోలకు ఫోజులివ్వడమే బాబుకు తెలుసు

ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు వెంపర్లాడారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు మురికి కాలువలో మునిగి.. దానినే గంగా నది అంటారని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశధార ప్రాజెక్టు పెండింగ్ పనులు, నేరేడ బ్యారేజ్ పనులు దగ్గర ఉండి చేయిస్తానని తెలిపారు. వంశధార ప్రాజెక్ట్ విషయమై ఒడిశాతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నించింది లేదని ఆరోపించారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుండగానే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 930 కోట్ల రూపాయలు కేటాయించి.. 700 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ.55 కోట్ల పనులను రూ.476 కోట్లకు పెంచేసి ఆ పనులను సీఎం రమేశ్‌కు అప్పగించారని జగన్ ఆరోపించారు.

హామీలు ఇచ్చి.. పనులు మొదలైనట్టు ఫొటోలకు ఫోజులివ్వడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని ఎద్దేశా చేశారు. రాష్ట్రంలోని అక్కాచెల్లమ్మలందరికీ వైఎస్సార్ చేయూత ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 45 నుంచి 60 ఏళ్ల నడుమ ఉన్న ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో రూ75వేల సాయం ఉచితంగా అందజేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
 

More Telugu News