ashok gehlot: మా పని మేము చేసుకుంటాం.. మీ పని మీరు చూసుకుంటే చాలు: అశోక్ గెహ్లాట్

  • మీ పని మీరు చేయలేకపోతే.. ప్రజలు ప్రశ్నిస్తారు
  • ఎంతో అనుభవం ఉన్నప్పటికీ వసుంధర రాజే పని చేయలేకపోయారు
  • పార్టీతో ఆమెకున్న విభేదాలు ప్రజలకు అవసరం లేదు

బీజేపీపై రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. రైతు రుణమాఫీపై బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై ఆయన స్పందిస్తూ... తమ పని తాము చేస్తామని చెప్పారు. మీ పనులపై మీరు దృష్టి సారిస్తే మేలని సూచించారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పని చేశామని... ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉందని, వారి పని వారు చేస్తే మంచిదని చెప్పారు. లేని పక్షంలో వారిని ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు.

ఇదే సమయంలో గత వసుంధరాజే ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నో గొప్పలు చెప్పుకున్న వసుంధర ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పార్టీతో అంతర్గతంగా ఆమెకు విభేదాలు ఉండవచ్చని... కానీ ప్రజలకు అవి అవసరం లేదని, అభివృద్ధి మాత్రమే ప్రజలకు కావాలని అన్నారు. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ప్రజల కోసం వసుంధర పని చేయలేకపోయారని చెప్పారు.

రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన తాజా ఎన్నికల్లో 200 స్థానాలకు గాను 99 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇదే సమయంలో 163 స్థానాల నుంచి 73 స్థానాలకు బీజేపీ పడిపోయింది. 

More Telugu News